
న్యూస్ డెస్క్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. RSSను “విషం”తో పోల్చిన ఆయన, ఆ సంస్థను దేశవ్యాప్తంగా నిషేధించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో మీడియాతో మాట్లాడిన ఆయన, RSS భావజాలంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మహాత్మా గాంధీ హత్య అంశాన్ని ఖర్గే మరోసారి తెరపైకి తెచ్చారు. 1948లో గాంధీజీ హత్యకు గురైతే, RSS శ్రేణులు సంబరాలు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. అందుకే ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆ సంస్థపై నిషేధం విధించారని గుర్తుచేశారు. హిందూ మహాసభ, RSS భావజాలం సృష్టించిన వాతావరణమే గాంధీ హత్యకు దారితీసిందని పటేల్ భావించారని ఖర్గే అన్నారు.
RSS కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి అనర్హులని, వారిపై నిషేధం విధించాలని ఖర్గే డిమాండ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిషేధం విధిస్తే, బీజేపీ దాన్ని కోర్టులో సవాలు చేసిందని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు RSSలో పాల్గొనకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీని “ఇండియన్ నాజీ కాంగ్రెస్”గా అభివర్ణించిన బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, గత యాభై ఏళ్లుగా కాంగ్రెస్ పటేల్‌ను విస్మరించిందని ఆరోపించారు. కేవలం RSSను వ్యతిరేకించడానికి మాత్రమే కాంగ్రెస్ ఇప్పుడు పటేల్ పేరును వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
RSS రాజకీయ పార్టీ కాదని, దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న రాజకీయేతర సంస్థ అని పూనావాలా అన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా, న్యాయస్థానమే RSSపై నిషేధాన్ని ఎత్తివేసిందని గుర్తుచేశారు. దేశభక్తి సంస్థపై విషం చిమ్మడం కాంగ్రెస్‌కు అలవాటేనని ఆయన ఎద్దేవా చేశారు.
సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా, ఇరు పార్టీలు పాత చరిత్రను తవ్వుతూ, తమకు అనుకూలమైన అంశాలతో ప్రత్యర్థులపై విమర్శలు చేసుకోవడం గమనార్హం.
