
న్యూస్ డెస్క్: 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత, గడిచిన 16 నెలలు భారత క్రికెట్‌కు గొప్పగా కలిసొచ్చాయి. అటు పురుషులు, ఇటు మహిళల జట్లు అంతర్జాతీయ టోర్నీలలో అద్భుత విజయాలు సాధిస్తూ దేశ కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ గడ్డపై మన ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ విజయాల పరంపర 2024 టీ20 ప్రపంచకప్‌తో మొదలైంది. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ, రోహిత్ శర్మ కెప్టెన్సీలోని సీనియర్ జట్టు వెస్టిండీస్, అమెరికా గడ్డపై అపజయం ఎరుగకుండా ఫైనల్ చేరింది. తుది పోరులో దక్షిణాఫ్రికాను ఓడించి రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది.
ఆ వెంటనే, వన్డేల్లో కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ కైవసం చేసుకుంది. 2013 తర్వాత ఈ ట్రోఫీ గెలవలేదు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో జట్టును ఫైనల్ చేర్చగా, అక్కడ న్యూజిలాండ్‌ను మట్టికరిపించి ఛాంపియన్‌గా నిలిచింది.
రోహిత్, కోహ్లీల రిటైర్మెంట్ తర్వాత, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోవడం మరో పెద్ద విజయం. గిల్ 700 పైగా పరుగులు, సిరాజ్ 23 వికెట్లతో సత్తా చాటారు.
ఇక ఇటీవలి ఆసియా కప్ (టీ20)లోనూ భారత్ దుమ్మురేపింది. పాకిస్థాన్‌ను మూడుసార్లు ఓడించి టైటిల్ గెలిచింది. పెహల్గామ్ దాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, పీసీబీ చీఫ్ నఖ్వీ చేతుల మీదుగా కప్ తీసుకోకుండా మన జట్టు నిరసన తెలిపి, మైదానం బయట కూడా గెలిచింది.
ఇప్పుడు, ఈ విజయాల స్ఫూర్తితో భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. 2017 తర్వాత ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఈసారి ఫైనల్‌లో బలమైన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో అమ్మాయిలు కప్ గెలిస్తే, భారత క్రికెట్ దశ తిరిగినట్లే.
