
న్యూస్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, పార్టీ ప్రస్తుత పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఘోర ఓటమి తర్వాత కూడా చాలా మంది నేతలు క్షేత్రస్థాయిలో చురుగ్గా లేకపోవడం, కేడర్‌కు భరోసా ఇవ్వకపోవడం, కేవలం పదవులను అలంకారప్రాయంగా భావించడంపై ఆయన సీరియస్‌గా ఉన్నారు. పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకునేందుకు ఆయన సిద్ధమైనట్లు సమాచారం.
ఈ ప్రక్షాళనలో భాగంగా, జగన్ ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిల పనితీరుపై దృష్టి సారించారు. చాలా చోట్ల ఇంచార్జిలపై కేడర్ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. 2024 ఎన్నికల ముందు సుమారు 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన ప్రయోగం వికటించింది. ఇప్పుడు వారిలో చాలా మంది ఇంచార్జులుగా ఉన్నా, వారికి స్థానిక కేడర్‌కు మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. ఈ పరిణామాలను జగన్ బేరీజు వేస్తున్నారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ భారీ ‘రిపేర్లకు’ జగన్ ఇప్పటికే ఓ ముహూర్తం ఫిక్స్ చేశారట. నవంబర్ నెలలోనే పార్టీలో కీలక మార్పులు, చేర్పులు ఉండనున్నాయని తెలుస్తోంది. ఏ ఇంచార్జి కేడర్‌తో ఉంటున్నారు, ఎవరు దూరంగా ఉంటున్నారనే దానిపై జగన్ వద్ద పూర్తి డేటా ఉందని, ఈసారి కేడర్, స్థానిక నాయకుల అభిప్రాయాలకే పెద్ద పీట వేయనున్నారని అంటున్నారు.
స్థానిక నేతల ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ఇంచార్జిలను కొనసాగించాలా, లేక చురుగ్గా పనిచేసే కొత్తవారికి అవకాశం ఇవ్వాలా అని జగన్ నిర్ణయిస్తారట. కూటమి ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇక స్థానిక సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని హైకమాండ్ భావిస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యాలయం ఇచ్చే పిలుపులతో పాటు, స్థానికంగా పోరాడే డైనమిక్ నాయకత్వం కోసం జగన్ చూస్తున్నారు.
ఈ ప్రక్షాళనకు మరో తక్షణ కారణం, కొత్త ఏడాది ఆరంభంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పార్టీని సమన్వయం చేయాల్సిన ఇంచార్జిలే డీలా పడితే, అది పార్టీకి పెను నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే, జగన్ ముందుగానే రంగంలోకి దిగి, పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా సరిదిద్దేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ రిపేర్ల ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
