Saturday, May 30, 2026
HomeLife Styleఐసీయూలో పెళ్లి.. గాయపడిన వధువును పెళ్లాడిన వరుడు!

ఐసీయూలో పెళ్లి.. గాయపడిన వధువును పెళ్లాడిన వరుడు!

kerala-groom-marries-bride-in-icu-after-road-accident

న్యూస్ డెస్క్: నేటి కాలంలో బంధాలు, భాగస్వామ్యాల విలువ తగ్గుతోందనే విమర్శలు వినిపిస్తున్న వేళ.. కేరళలో జరిగిన ఒక ఘటన నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. పెళ్లికి ముందు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువును ఐసీయూలోనే పెళ్లాడి, ఆ వరుడు తన నిబద్ధతను చాటుకున్నాడు.

కేరళలోని అలప్పుళ ప్రాంతానికి చెందిన ఆవని-శరణ్‌ల పెళ్లి శుక్రవారం జరగాల్సి ఉంది. అయితే ఆవని పెళ్లి మేకప్‌ వేయించుకోవడానికి వెళ్తున్న సమయంలో వారి కారు చెట్టును బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆవనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వెన్నుముకకు బలమైన గాయమైంది.

ఈ షాకింగ్ న్యూస్ విన్న ఇరు కుటుంబాలు ఆసుపత్రికి పరుగున వచ్చాయి. అయితే అనుకున్న శుభ ముహూర్తానికి ఆవనిని పెళ్లాడాలని వరుడు శరణ్ బలంగా నిర్ణయించుకున్నాడు. ఆస్పత్రిలో ఆవని పరిస్థితి చూసినా, శరణ్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

శరణ్ ఆలోచనకు పెద్దలు కూడా అంగీకరించారు. దీంతో.. డాక్టర్లను కలిసి పెళ్లి చేసుకోవాలనే తమ కోరికను వివరించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న వైద్యులు.. ప్రత్యేక అనుమతితో ఆవని చికిత్స పొందుతున్న ఐసీయూ గదిలోనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఆవని బెడ్‌పై ఉండగా, ఆ పక్కనే శరణ్ నిలబడి.. అనుకున్న ముహూర్తానికి తాళి కట్టాడు. ఆసుపత్రి గదిలో ఇరు కుటుంబాల ఆశీర్వాదాల మధ్య ఈ అరుదైన వివాహం జరిగింది. ఆవనికి వెన్నుముక గాయానికి త్వరలోనే సర్జరీ జరగనుంది.

పెళ్లి అంటే కేవలం సంబరం మాత్రమే కాదు, తోడు ఉండడం అని శరణ్ నిరూపించాడు. అత్యంత ఒత్తిడిలోనూ పట్టు వీడకుండా జరిగిన ఈ అరుదైన పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నిజమైన ప్రేమకు ఉన్న విలువను చాటి చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular