
న్యూస్ డెస్క్: బీఆర్ఎస్ సీనియర్ నేత మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తప్పనిసరిగా మారింది. ప్రధాన పార్టీలు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నాయి.
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం 3,98,992 మంది ఓటర్లు ఉన్నారు.
మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓటర్లు తమ పేర్లను ఈసీఐ వెబ్‌సైట్ లేదా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అవసరమైతే ఫారం 7, ఫారం 8 ద్వారా మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంది.
జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం 6 ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ ఇంకా అభ్యర్థి ఎంపికలోనే ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.
స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా ఈ ఉప ఎన్నిక జరగాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోరు రాజకీయంగా హాట్ టాపిక్ కావడం ఖాయం.
