
న్యూస్ డెస్క్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఏర్పడి ఈ అక్టోబర్ 25తో 100 ఏళ్లు పూర్తవుతున్నాయి. 1925లో విజయదశమి రోజున డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది నిరంతర ప్రయాణం కొనసాగిస్తూ నేటికి అతి పెద్ద సాంస్కృతిక, సామాజిక శక్తిగా ఎదిగింది.
ఈ సంస్థపై ఎన్నోసార్లు నిషేధం విధించినా, విభిన్న భావజాలాలతో విమర్శలు ఎదురైనా ఆర్ఎస్ఎస్ వెనకడుగు వేయలేదు. కాలక్రమేణా సేవా, విద్యా, సాంస్కృతిక రంగాలతో పాటు రాజకీయ విభాగంగా జనసంఘ్, తర్వాత బీజేపీ ఆవిర్భవించాయి.
దేశానికి పలు కీలక నాయకులను అందించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, నరేంద్ర మోడీ వంటి నేతలు ఆర్ఎస్ఎస్ పాఠశాలలోంచి వచ్చినవారే. రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు కూడా ఈ నేపథ్యంతో ముందుకు వచ్చిన వారే.
వందేళ్ల సంబరాలు ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో అక్టోబర్ 1న జరుగనున్నాయి. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ ప్రయాణాన్ని ప్రతిబింబించే స్మారక తపాలా బిళ్లలు, నాణేలు విడుదల చేస్తారు. అనంతరం సభలో ప్రసంగం చేయనున్నారు.
దేశంలో బీజేపీ అధికారంలో ఉండగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు జరగడం, ఈ సంస్థ విజయాన్ని సూచించే ఘట్టంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
