
న్యూస్ డెస్క్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు విజయం అంచున నిలిచింది. సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకునేందుకు టీమిండియా ముందు కేవలం 121 పరుగుల స్వల్ప లక్ష్యం ఉండగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది.
విజయానికి చివరి రోజు మరో 58 పరుగులు మాత్రమే అవసరం కాగా, చేతిలో ఇంకా 9 వికెట్లు ఉండటంతో గెలుపు లాంఛనమే.
ప్రస్తుతం కేఎల్ రాహుల్ (25), సాయి సుదర్శన్ (30) క్రీజులో నిలకడగా ఆడుతున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (8) స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యాడు. అంతకుముందు, ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటై భారత్‌కు గట్టి పోటీ ఇచ్చింది.
విండీస్ బ్యాటర్లలో జాన్ క్యాంప్‌బెల్ (115), షై హోప్ (103) అద్భుతమైన శతకాలతో రాణించారు. చివర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్) కీలక అర్ధశతకం సాధించాడు. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగగా, జస్‌ప్రీత్ బుమ్రా 3, మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్, తొలి ఇన్నింగ్స్‌ను 518/5 పరుగుల వద్ద భారీ స్కోరుతో డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు.
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 248 పరుగులకే కుప్పకూలడంతో, ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. ప్రస్తుతం మ్యాచ్‌పై టీమిండియా పూర్తి పట్టు సాధించింది.
