న్యూస్ డెస్క్: ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ అనగానే అభిమానుల్లో ఉత్సాహం అద్భుతంగా ఉంటుంది. ఈసారి కూడా సెప్టెంబర్ 14న జరగబోయే పోరు కోసం అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. కానీ ఒక ఆసక్తికరమైన విషయం క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఆసియా కప్ 1984లో మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 19 సార్లు భారత్-పాక్ తలపడ్డాయి. ఇందులో భారత్ 10 సార్లు గెలిచింది, పాక్ 6 సార్లు విజయం సాధించింది. మరో మూడు మ్యాచులు ఫలితం లేకుండా ముగిశాయి. కానీ ఒక్కసారైనా ఈ రెండు జట్లు ఫైనల్‌లో తలపడకపోవడం ప్రత్యేకం.
టీమిండియా మొత్తం 8 సార్లు ఆసియా కప్‌ను గెలుచుకోగా, ఒక్కసారి కూడా ఫైనల్‌లో పాక్ ఎదురుగా రాలేదు. పాకిస్థాన్ కేవలం 2 సార్లు మాత్రమే టైటిల్ సాధించింది. మిగిలిన సందర్భాల్లో శ్రీలంక ఎక్కువగా ఫైనల్ ప్రత్యర్థిగా నిలిచింది.
1984 తొలి ఎడిషన్‌లో భారత్-శ్రీలంక ఫైనల్ ఆడగా, 1986లో భారత్ ఆడకపోవడం చరిత్ర. అలాగే 1991లో పాక్ ఆడలేదు. ఈ కారణంగా ఇరుజట్లు ఒకేసారి ఫైనల్‌కు చేరే అవకాశం లేకుండా పోయింది.
విశేషం ఏమిటంటే, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో మాత్రం భారత్-పాక్ తలపడ్డాయి. కానీ ఆసియా కప్‌లో మాత్రం ఈ కలయిక జరగలేదు.
ఈసారి అయినా ఫైనల్‌లో భారత్-పాక్ ఎదురెదురుగా ఆడతారా అనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువైంది. సెప్టెంబర్ 14 మ్యాచ్ దానికో కొత్త దారిని చూపే అవకాశం ఉంది.
