
న్యూస్ డెస్క్: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపై ఉన్న సానుకూల అంచనాలు బుధవారం స్టాక్ మార్కెట్లకు బలాన్నిచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ముందుకు రావడంతో మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.
రోజంతా ఉత్సాహంగా సాగిన ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 409 పాయింట్లు పెరిగి 80,567 వద్ద ముగిసింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 135 పాయింట్లు లాభపడి 24,715 వద్ద స్థిరపడింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం జీఎస్టీ రేట్లలో తగ్గింపులు వస్తాయనే అంచనానేనని నిపుణులు విశ్లేషించారు.
మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాల్లో షేర్ల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. నిఫ్టీ మెటల్ సూచీ ఏకంగా 3.11 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా లాభాల్లో ముగియడం మార్కెట్ ఉత్సాహాన్ని చూపించింది.
టాటా స్టీల్, టైటాన్, మహీంద్రా, ఎస్బీఐ, టాటా మోటార్స్ షేర్లు లాభపడగా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎయిర్‌టెల్ షేర్లు మాత్రం నష్టపోయాయి. ఇన్వెస్టర్లు వినియోగం పెరుగుతుందన్న ఆశతో కొనుగోళ్లకు మొగ్గు చూపారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక కరెన్సీ మార్కెట్లో రూపాయి స్వల్పంగా బలపడింది. డాలర్‌తో పోలిస్తే 0.13 పైసలు పెరిగి 88.02 వద్ద ట్రేడ్ అయింది. దీన్ని కూడా మార్కెట్లకు సహాయక అంశంగా పరిగణిస్తున్నారు.