న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక ఒప్పందం కుదిరింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏఎన్ఎస్ఆర్ సంస్థ విశాఖపట్నంలో భారీ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
మధురవాడ ఐటీ క్లస్టర్‌లో జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సంస్థ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఈ క్యాంపస్ వల్ల ఐదేళ్లలో 10,000 ఉద్యోగాలు వస్తాయి.
మంగళవారం మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. సంస్థ సీఈఓ లలిత్ అహూజా మాట్లాడుతూ, విశాఖకు భవిష్యత్తులో అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రతిభను ప్రపంచ స్థాయి సంస్థలతో అనుసంధానించడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. విశాఖలో మౌలిక సదుపాయాలు, టాలెంట్ ఉన్నత స్థాయిలో ఉన్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా నాలుగేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందులో ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలపై దృష్టి సారిస్తున్నట్టు వెల్లడించారు.