
న్యూస్ డెస్క్: టార్గెట్ 214.. మొదటి ఓవర్‌లోనే కీలక ఆటగాడు ఔట్ అయిన క్లిష్ట సమయంలో టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో అతను బ్యాటింగ్ ఆర్డర్ లో చేసిన మార్పులు చర్చనీయంగా మారాయి.
సాధారణంగా ఇలాంటి భారీ చేజింగ్ సమయంలో హార్డ్ హిట్టర్ ను వన్ డౌన్ లో పంపుతారు. కానీ, గంభీర్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన అక్షర్ పటేల్‌ను వన్ డౌన్ లో ప్రమోట్ చేశారు. అక్షర్ ఫామ్ లో ఉన్నప్పటికీ, భారీ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో అతన్ని పంపడం సరైన నిర్ణయం కాదని విశ్లేషకులు అంటున్నారు.
ఈ మ్యాచ్ లో అక్షర్ 21 బంతుల్లో కేవలం 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. స్కోరు వేగం పెంచలేకపోయాడు. దీంతో గంభీర్ ప్రయోగం విఫలమైందనే విమర్శలు వచ్చాయి.
జితేశ్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబే వంటి బ్యాటర్లు అందుబాటులో ఉండగా, అక్షర్ ను వన్ డౌన్ లో పంపడం, చివరకు పవర్ హిట్టర్ శివమ్ దూబేను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయించడం తీవ్ర అసహనం రేకెత్తించింది.
మొదటి టీ20లో బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా ఉన్నప్పటికీ, రెండో మ్యాచ్ లో క్లిష్ట పరిస్థితుల్లో గంభీర్ ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇలా లోయరార్డర్ బ్యాటర్‌ను వన్ డౌన్ లో పంపి, ఆఖర్లో హార్డ్ హిట్టర్‌ను దింపడంపై విమర్శలు తీవ్రమవుతున్నాయి.
ఐపీఎల్‌లో కోచ్‌గా ఇష్టారీతిన ప్రయోగాలు చేసినట్లుగానే, ఇప్పుడు టీమ్ ఇండియా విషయంలోనూ గంభీర్ అదే తీరును అనుసరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖరి టీ20 ఆదివారం ధర్మశాలలో జరగనుంది.
