
న్యూస్ డెస్క్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తీసుకున్న తాజా నిర్ణయం కోట్లాది మంది ఉద్యోగులకు పెద్ద ఊరట. ఇకపై పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ విషయంలో నిబంధనలు మరింత సరళంగా మారాయి. పీఎఫ్ నిధిలో ఉపసంహరించుకోగల బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు తీసుకునేందుకు ఈపీఎఫ్ఓ అనుమతి ఇచ్చింది.
ఉపసంహరణల సంఖ్యను కూడా పెంచడం మరో ముఖ్యమైన అంశం. చదువుల కోసం 10 సార్లు, వివాహం కోసం 5 సార్లు వరకు పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు. గతంలో ఈ రెండింటికి కేవలం మూడుసార్లు మాత్రమే అనుమతి ఉండేది.
గతంలో ప్రత్యేక పరిస్థితుల ఆప్షన్‌లో నిరుద్యోగం, ప్రకృతి విపత్తులు వంటి కచ్చితమైన కారణాలు చెప్పాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎలాంటి కారణాలు చెప్పవలసిన అవసరం లేకుండానే పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు.
పీఎఫ్ పాక్షిక ఉపసంహరణకు సంబంధించిన 13 సంక్లిష్టమైన నిబంధనలను ఈపీఎఫ్ఓ ఒకే నిబంధనగా క్రమబద్ధీకరించింది. ఈ నిబంధనలను ముఖ్యమైన అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులుగా వర్గీకరించారు. ముఖ్యమైన అవసరాలలో అనారోగ్యం, విద్య, వివాహం వంటివి ఉన్నాయి.
ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తంలో 25 శాతాన్ని కనీస బ్యాలెన్స్‌గా ఉంచేలా కొత్త నిబంధన రూపొందించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నేతృత్వంలో సమావేశమైన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.
