
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) లోపల రాజెవరో మంత్రెవరో తెలియని పరిస్థితి నెలకొందని, అందుకే ఇప్పటి నుంచి ఎందుకు చమటోడ్చడం అనే అంతర్గత చర్చ నడుస్తోంది.
దీనికి కారణం, అధినాయకత్వం ఇంచార్జిల నియామకంపై తీసుకుంటున్న వైఖరి. ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో ఇంచార్జిల పనితీరుపై క్యాడర్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు తమ కోటరీకి మాత్రమే మేలు చేసి, క్యాడర్‌ను పట్టించుకోలేదనే బాధ నేతల్లో ఉంది. దాంతో వారిని మార్చాలని కోరుతూ హైకమాండ్‌కు విన్నపాలు అందుతున్నాయట. అయితే ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉండటంతో, ఇప్పుడే రిపేర్లు మొదలుపెట్టి పాత వారిని మారిస్తే లేనిపోని తలకాయ నొప్పులు వస్తాయని అధినాయకత్వం ఆలోచిస్తోంది.
నాయకులు ఎమ్మెల్యే స్థాయి వారే కావడం, జనంలో పలుకుబడి ఉండటంతో వారిని సడెన్‌గా మారిస్తే అది కూటమికి మంచి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని కూడా పార్టీ భావిస్తోంది. అందుకే ఎవరినీ కదపకుండా, కేవలం పనితీరు విషయంలో దిశా నిర్దేశం మాత్రమే చేస్తూ వస్తోంది.
వైసీపీ అధినాయకత్వం వైపు చూస్తే, 2029 ఎన్నికలు చాలా కీలకమైనవిగా ఉన్నాయి. గెలుపు గుర్రాలకే అవకాశాలు ఇవ్వాలని, ఎవరికీ సాఫ్ట్ కార్నర్ ఉండకూడదని జగన్ నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికలకు ఏడాది ముందు పూర్తి స్థాయిలో ప్రక్షాళన ఉంటుందని చెబుతున్నారు.
2029లో గెలుపు చాన్స్ ఎంతవరకు ఉంది అన్నది చూసుకుని మాత్రమే టికెట్లు ఇస్తారని అంటున్నారు. ఈ విషయంలో జగన్ ఎవరికీ మినహాయింపు ఇవ్వరని కూడా చర్చ జరుగుతోంది.
ఎన్నికలలో ఓటమి తర్వాత వైసీపీలో మార్పు ఏమైనా ఉందా అంటే పెద్దగా కనిపించడం లేదు. చూస్తుండగానే పదహారు నెలలు గడిచిపోయాయి. అధికార కూటమి ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నా, విపక్షంగా వైసీపీ మాత్రం తమకేమీ పట్టనట్లుగా మౌనంగా ఉండటం ఈ అంతర్గత రాజకీయానికి దారితీసింది.
