
న్యూస్ డెస్క్: బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ కవిత, ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సోదరుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుపై కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఆమె బీఆర్ఎస్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత దీక్షా దివస్‌లు విజయ్ దివస్‌లు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పై కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇది ఉద్యమాల గడ్డ అని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కవిత అన్నారు.
విజయ్ దివస్ వివాదం:
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఆనాటి యూపీఏ ప్రభుత్వం పచ్చజెండా ఊపిన రోజు డిసెంబర్ 9. ఈ సందర్భంగా తెలంగాణ అంతటా విజయ్ దివస్‌ను బీఆర్ఎస్ నిర్వహిస్తోంది.
ఆనాడు కేసీఆర్ దీక్ష విరమించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కేటీఆర్ హరీష్ రావు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు తొలి అడుగుపడి నేటికి 16 ఏళ్లు అని కేటీఆర్ అన్నారు. నవంబర్ 29 దీక్షా దివస్ లేకుంటే డిసెంబర్ 9 విజయ్ దివస్ లేదని, డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ క్రెడిట్:
వాస్తవానికి డిసెంబర్ 9న కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజు. ఆ రోజే ఆనాటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని ప్రకటించారు. దీంతో, తన పుట్టిన రోజు నాడు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ప్రత్యేక తెలంగాణను గిఫ్ట్‌గా ఇచ్చారని కాంగ్రెస్ నేతలు ఆ క్రెడిట్‌ను క్లెయిమ్ చేస్తున్నారు.
కవిత విమర్శల వెనుక:
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష మొదలుబెట్టిన నవంబరు 29వ తేదీని మాత్రమే బీఆర్ఎస్ నేతలు దీక్షా దివస్ పేరిట పదేళ్లుగా నిర్వహిస్తున్నారు. అయితే, డిసెంబరు 9 న కార్యక్రమాలు జరిపి ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అన్న క్రెడిట్ ఆ పార్టీ తీసుకోవడంతో బీఆర్ఎస్ కు మైలేజ్ తగ్గుతోందని విమర్శలు వస్తున్నాయి. అందుకే సడెన్‌గా ఈ ఏడాది విజయ్ దివస్ నిర్వహించాలని కేటీఆర్ భావించారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.
