
న్యూస్ డెస్క్: విశాఖలో నిర్వహించిన సీఐఐ పెట్టుబడుల సదస్సుకు పోటీ పడుతున్నట్టుగా, తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025ను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సదస్సులో తొలిరోజు భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించారు.
దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు తొలిరోజు ఏకంగా 2.48 లక్షల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు చేసుకున్నాయి. వీటిలో కీలకమైన డీప్ టెక్నాలజీ, హరిత ఇంధనం, ఏరో స్పేస్ వంటి రంగాలలో పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యంగా డీప్ టెక్నాలజీలోనే 75 వేల కోట్ల రూపాయల ఒప్పందాలు జరగడం విశేషం.
తొలి రోజు ఒప్పందాలు వివరాలు:
- డీప్ టెక్నాలజీ: 75 వేల కోట్లు
- గ్రీన్ ఎనర్జీ: 27 వేల కోట్లు
- పునరుత్పాదక ఇంధనం: 39,700 కోట్లు
- ఏరోస్పోస్, డిఫెన్స్: 19,350 కోట్లు
- ఏవియేషన్: 15 వేల కోట్లు
- తయారీ రంగం: 13,500 కోట్లు
- ఉక్కు: 7 వేల కోట్లు
- టెక్స్‌టైల్స్: 4 వేల కోట్లు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి:
వాస్తవానికి తెలంగాణ రైజింగ్ సదస్సు అని పేరు పెట్టినా, సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. పొరుగున ఉన్న ఏపీతో పోటీ పడతామని ఆయన అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. సుమారు రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తొలిరోజు విజయం దక్కించుకున్నారు.
రెండో రోజు ప్లాన్:
రెండో రోజు సదస్సులో మంగళవారం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ డాక్యుమెంటును ఆవిష్కరించనున్నారు. తద్వారా 2047 నాటికి తెలంగాణ అభివృద్ధి, చేయనున్న పనులను ఆయన వివరించనున్నారు.
