
బెంగళూరు: పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు వరుస లీకులతో ఉలిక్కిపడుతోంది. ఇటీవల సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి టీవీ చూస్తూ, ఫోన్ వాడుతున్న వీడియోలు సంచలనం సృష్టించగా, అధికారులు అవి పాతవని (2023 నాటివి) సర్దిచెప్పారు.
ఆ వాదన మరువక ముందే, ఇప్పుడు అంతకు మించిన మరో వీడియో బయటకు వచ్చింది. ఇది వారం క్రితం తీసినట్లుగా కనిపిస్తోంది. ఈ తాజా వీడియోలలో ఖైదీలు బ్యారక్‌లలో ఏకంగా ‘మందు పార్టీ’ చేసుకుంటూ కనిపించారు.
డిస్పోజబుల్ గ్లాసులు, మద్యం సీసాలు, వేయించిన పల్లీలు, పండ్లతో కొందరు ఖైదీలు డ్యాన్సులు వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెట్టాయి. జైల్లోకి ఇవన్నీ ఎలా వెళ్లాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
వరుస వీడియోల లీకేజీతో కర్ణాటక జైళ్ల శాఖ తీవ్ర విమర్శల పాలైంది. ఈ తాజా లీక్‌లపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఖైదీలకు మొబైల్ ఫోన్లు, మద్యం ఎలా అందుతున్నాయనే కోణంలో లోతైన దర్యాప్తుకు ఆదేశించారు.
ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జైళ్ల శాఖ డీజీపీ తెలిపారు. రేపిస్టులు, నేరస్థులు జైలును స్వర్గసీమలా మార్చుకున్న ఈ వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
