
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసుపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్‌ను ఈ సిట్‌కు చీఫ్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
సిట్ సభ్యులుగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, సీఐడీ ఎస్పీ కె. చక్రవర్తి, టెక్నికల్ సర్వీసెస్ ఎస్పీ మల్లికా గార్గ్‌లను నియమించారు. నకిలీ మద్యం అక్రమ తయారీ, సరఫరా, పంపిణీ నెట్‌వర్క్‌పై లోతుగా విచారణ జరిపి మూలాలను వెలికితీయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దర్యాప్తు పురోగతిని ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఇప్పటికే పోలీసులు ప్రభుత్వానికి అందించారు. తదుపరి విచారణను సిట్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి కారణం, అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువులో నకిలీ మద్యం ఘటన వెలుగు చూడటమే. ఈ ఘటనపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్ననే సిట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనకు అనుగుణంగా నేడు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
