
న్యూస్ డెస్క్: అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా ఘాటి విడుదలకు సిద్దమవుతోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. అనుష్క పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండటం సినిమాకు పెద్ద ఆకర్షణగా మారింది.
ఈ సందర్భంగా మరో ప్రత్యేకమైన విషయం వెలుగులోకి వచ్చింది. కేజీయఫ్ స్టార్ యశ్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ తన కొత్త డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీ.ఎ. ఫిల్మ్స్ ద్వారా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అడుగు పెడుతున్నారు. ఆమె పంపిణీ చేయబోయే తొలి చిత్రం ఘాటి కావడం విశేషం.
ప్రచారం ప్రకారం, పుష్ప అరుణ్ కుమార్ ఈ సినిమాకి సంబంధించిన విజువల్స్, కథ, అనుష్క పర్ఫార్మెన్స్ చూసి బాగా మెప్పుపొందారని తెలుస్తోంది. హీరోయిన్ సెంట్రిక్‌గా నడిచే ఈ చిత్రం తన డిస్ట్రిబ్యూషన్ కెరీర్‌కి సరైన ఆరంభమని ఆమె భావిస్తున్నారు.
ఘాటిలో అనుష్కతో పాటు మరో కీలక పాత్రల్లో ప్రతిభావంతమైన నటీనటులు కనిపించనున్నారు. క్రిష్ మునుపటి చిత్రాల మాదిరిగా ఈ సినిమాకీ బలమైన కథనం ఉంటుందని సినిమా బృందం చెబుతోంది.
ఈ కొత్త ఎంట్రీతో పాటు, ఘాటిపై ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు అభిమానులు, ట్రేడ్ వర్గాల దృష్టంతా ఈ సినిమాపైనే నిలిచింది.