
న్యూస్ డెస్క్: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి, మళ్లీ మరో పవర్‌ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన ఘాటి సెప్టెంబర్ 5న విడుదల కానుంది.
ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉండగా, ఆ తర్వాత అనుష్క తన కెరీర్‌లో కొత్త మలుపు తిరగనుంది.
మొదటిసారిగా మలయాళ సినిమాల్లో అడుగుపెట్టబోతోంది అనుష్క. రొజిన్ థామస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కథనార్ – ది వైల్డ్ సోర్సరర్ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించనుందని సమాచారం. ఈ చిత్రంలో జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై మాలీవుడ్ వర్గాల్లో మంచి హైప్ ఉంది.
ఈ ప్రాజెక్టు రెండు భాగాలుగా తెరకెక్కనుందని తెలుస్తోంది. కథనం ప్రకారం, తొమ్మిదో శతాబ్దంలో మాయా శక్తులు కలిగిన క్రైస్తవ పూజారి కథనార్ జీవితం ఆధారంగా కథ సాగనుంది. విజువల్ గ్రాండ్యూర్‌తో రూపొందే ఈ సినిమా మలయాళ చిత్రసీమలో ప్రత్యేక స్థానం సంపాదించుకునే అవకాశముందని అంచనాలు ఉన్నాయి.
అనుష్క ఇప్పటివరకు తెలుగు, తమిళ భాషల్లోనే ఎక్కువగా సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు మలయాళంలో ఎంట్రీ ఇవ్వడం, కొత్త రకమైన పాత్రలో కనిపించడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.