
అనంతపురం: అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నారు. ఈసారి ఆయన జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రచ్చరచ్చగా మారింది.
తాజాగా విడుదలైన వార్ 2 సినిమా అనంతపురంలో ఆడనివ్వనని ప్రసాద్ అభిమానులకు ఫోన్ చేసి హెచ్చరించారన్న వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా తారక్‌పై అసభ్య పదజాలం వాడారన్న ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హైదరాబాద్‌లో ఉన్న ప్రసాద్ వెంటనే స్పందించి, ఆ వాయిస్ తనది కాదని, వీడియోలు ఫేక్ అని చెప్పారు. తనను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తారక్ అభిమానినే తానని, దూషించే ప్రశ్నే లేదని వివరణ ఇచ్చారు.
కానీ అనంతపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రసాద్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తారక్ అభిమానులు ఫ్లెక్సీలు చించి నినాదాలు చేశారు. ప్రసాద్ అనుచరులు అక్కడికి చేరుకుని వారితో ఘర్షణకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఉద్రిక్తతను తగ్గించారు.
తారక్ అభిమానులు మాత్రం ఆడియోలో ఉన్న వాయిస్ దగ్గుపాటిదేనని నొక్కి చెబుతున్నారు. బహిరంగంగా మీడియా సమావేశం పెట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తమ ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం ఏ దిశగా వెళుతుందో స్పష్టత రాలేదు. దగ్గుపాటి నిజంగానే చిక్కుల్లో పడతారా లేక ఈ వివాదం తగ్గిపోతుందా అన్నది చూడాలి.