
న్యూస్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా, రాబోయే పండగ సీజన్ కోసం భారీ స్థాయిలో తాత్కాలిక ఉద్యోగ నియామకాలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా సీజనల్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. పెరిగే ఆన్‌లైన్ డిమాండ్‌ను తట్టుకోవడం కోసం తీసుకున్న ఈ నిర్ణయం, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వేలాది నిరుద్యోగులకు శుభవార్తగా మారింది.
దేశంలోని సుమారు 400 నగరాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పూణె, లక్నో, కొచ్చి వంటి ప్రధాన నగరాల్లో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, సార్టింగ్ కేంద్రాలు, డెలివరీ స్టేషన్లలో సిబ్బందిని నియమించనున్నారు. వీటిలో మహిళలకు, దివ్యాంగులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అమెజాన్ స్పష్టం చేసింది.
అమెజాన్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ మాట్లాడుతూ, ప్రతి పండగ సీజన్‌లో కొత్తగా చేరిన వారిలో చాలామంది తరువాత కూడా కంపెనీతో కొనసాగుతున్నారని అన్నారు. ఉద్యోగుల భద్రత, శ్రేయస్సుకు అమెజాన్ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగుల కోసం ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పిస్తోంది అమెజాన్. దేశవ్యాప్తంగా ‘ఆశ్రయ్’ రెస్ట్ సెంటర్ల సంఖ్యను 100కి పెంచింది. అలాగే 80,000 మందికి పైగా డెలివరీ సిబ్బందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు అందిస్తోంది.
అదనంగా ఉద్యోగుల ఆర్థిక సౌలభ్యం కోసం ‘ఎర్లీ యాక్సెస్ టు పే’ (EATP) సదుపాయం కల్పించింది. దీని ద్వారా జీతంలో 80 శాతం వరకు ముందుగానే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. పండగల సమయంలో ఇది వారికి మరింత ఉపశమనాన్ని ఇస్తుందని అమెజాన్ ప్రకటించింది.