న్యూస్ డెస్క్: అమెరికా ఆర్థిక వ్యవస్థలో భయం మొదలైంది. గత రెండేళ్లుగా ‘భవిష్యత్తు’గా కీర్తించబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం కుప్పకూలుతోంది. ఇది ‘ఏఐ బబుల్ బరస్ట్’ (AI Bubble Burst) అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ పతనానికి నిదర్శనంగా, అక్టోబర్ 2025 నెలలోనే 1.53 లక్షల ఉద్యోగాలు ఊడాయి. ఇది గత 20 ఏళ్లలో ఇదే అత్యధికం. ఈ ఏడాదితో కలుపుకుంటే మొత్తం 11 లక్షల మంది ఉపాధి కోల్పోయారు.
టెక్ రంగానికి గుండెకాయలాంటి నాస్‌డాక్ (Nasdaq) మార్కెట్ నవంబర్ 6న భారీ పతనాన్ని చవిచూసింది. వాస్తవ వృద్ధి కంటే ఎక్కువ విలువ పలికిన ఏఐ కంపెనీల షేర్లు ఇప్పుడు కుప్పకూలుతున్నాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు.
ఈ పతనానికి ఏఐ ఆటోమేషన్ వ్యాప్తి ఒక కారణం కాగా, ఆర్థిక మాంద్యం భయాలు మరో కారణం. ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ప్రభావం టెక్ రంగం దాటి రిటైల్, లాజిస్టిక్స్‌కు పాకింది.
ఈ పరిణామాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యం దిశగా నెడుతున్నాయి. ఇప్పటికే $38 ట్రిలియన్ల అప్పు, ద్రవ్యోల్బణం భయాలు, రాజకీయ అస్థిరత దేశాన్ని బలహీనపరుస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న భయం వెంటాడుతోంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన అమెరికా తడబడితే, దాని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడుతుంది. ఏఐ విప్లవం ఇప్పుడు ఆర్థిక బుడగగా మారి పగిలిపోయిందని, ఇది ప్రపంచ పెట్టుబడిదారులకు హెచ్చరిక అని నిపుణులు అంటున్నారు.
