
న్యూస్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థత కారణంగా హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
గత రెండు రోజులుగా నీరసం కారణంగా గురువారం సాయంత్రం కేసీఆర్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచన మేరకు పలు పరీక్షలు నిర్వహించారు.
వైద్యుల ప్రకారం, కేసీఆర్ రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా, సోడియం తక్కువగా ఉన్నట్టు తేలింది. శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం, ఈ స్థాయిలు సాధారణ స్థాయికి వచ్చే వరకూ ఆయన ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటారు.
కేసీఆర్ ఆరోగ్యం విషయంలో పార్టీ శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని ఆయన కుమారుడు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది కేవలం సాధారణ వైద్య పరీక్షల కోసమేనని స్పష్టం చేశారు.
వైటల్స్ అన్నీ బాగానే ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.