
న్యూస్ డెస్క్: కరెన్సీ నోట్ల ముద్రణలో ఆశ్చర్యకరమైన లెక్కలు బయటపడ్డాయి. రూ.500 నోటుతో పోలిస్తే రూ.200 నోటు ప్రింటింగ్ ఖర్చు ఎక్కువగా ఉన్నట్లు రిజర్వు బ్యాంక్ తాజా నివేదిక తెలిపింది.
2018లో చలామణిలోకి వచ్చిన రూ.200 నోటు ముద్రణ ఖర్చు అప్పట్లో రూ.2.15 ఉండేది. అదే సమయంలో రూ.500 నోటుకు రూ.2.24 ఖర్చు అయ్యేది. అయితే ఇప్పుడు ఈ లెక్కలు మారాయి. తాజా గణాంకాల ప్రకారం రూ.200 నోటు తయారీకి రూ.2.37 ఖర్చు అవుతుండగా, రూ.500 నోటు తయారీకి కేవలం రూ.2.29 మాత్రమే ఖర్చవుతోంది.
విలువలో రూ.500 నోటు ఎక్కువ అయినా, తయారీ ఖర్చు మాత్రం రూ.200 నోటుకు ఎక్కువ కావడం గమనార్హం. దీనికి కారణం నకిలీ నోట్ల బెడద. రూ.200 నోట్లలో ఎక్కువ భద్రతా లక్షణాలు ఉండటం వల్ల ప్రింటింగ్ ఖర్చు పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
ఇక రూ.100 నోటు తయారీకి రూ.1.77, రూ.50 నోటుకు రూ.1.13, రూ.20 నోటుకు 95 పైసలు, రూ.10 నోటుకు 96 పైసలు ఖర్చవుతున్నట్లు వెల్లడైంది.
గత ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణ కోసం ఆర్‌బీఐ రూ.6372 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం చలామణీలో ఉన్న నోట్లలో 40% రూ.500 నోట్లు ఉండగా, వాటి విలువ మాత్రం 80% కంటే ఎక్కువగా ఉందని వివరించారు.
మొత్తానికి విలువ తక్కువైనా, భద్రతా ప్రమాణాల కారణంగా రూ.200 నోటు ప్రింటింగ్ ఖర్చు రూ.500 కంటే ఎక్కువ అవుతోంది.