
ఓటర్లకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఓటర్ ఐడీ కార్డు కోసం నెలలు గడిచిపోయే పరిస్థితిని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది.
ఇకపై కొత్తగా దరఖాస్తు చేసినవారికి కేవలం 15 రోజుల్లోనే ఓటర్ కార్డు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త విధానం కొత్త ఓటర్లకే కాదు, కార్డులో మార్పులు కోరినవారికి కూడా వర్తించనుంది. ప్రస్తుతం నెలకు పైగా సమయం పడుతుండగా, ఈసీ తీసుకున్న తాజా నిర్ణయం వేగవంతమైన సేవలకు నిదర్శనంగా నిలుస్తోంది.
కార్డు ప్రాసెసింగ్ దశ నుంచి డెలివరీ వరకు ప్రతి దశను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయనున్నారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ స్థాయి నుంచి పోస్టల్ శాఖ వరకు సమగ్ర పర్యవేక్షణ ఉంటుంది.
వివరాల ట్రాకింగ్ కోసం ఓటర్లకు ఎస్ఎంఎస్‌లు పంపనున్నారని ఈసీ తెలిపింది. దీని వల్ల అప్రమత్తంగా ఉండేందుకు ఓటర్లకు అవకాశం ఉంటుంది.
తరువాతి నెలల్లో బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చర్యలతో ఓటర్లకు వేగంగా సేవలు అందించాలనే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.