
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ఫాంటసీ ఎంటర్‌టైనర్ విశ్వంభర పై అభిమానుల్లో అపారమైన అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత చిరంజీవి స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తుండటమే కాకుండా, ఆయనకు బాగా సూట్ అయ్యే జానర్ కావడంతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ భారీ హైప్ ఏర్పడింది.
అయితే చిత్రానికి సంబంధించిన తాజా రూమర్లు ఫ్యాన్స్‌లో నిరాశ కలిగిస్తున్నాయి. సినిమా రిలీజ్ మళ్లీ వాయిదా పడిందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు ప్లాన్ ప్రకారం ఈ ఏడాది చివర్లో లేదా సంక్రాంతి సీజన్‌లో రావాల్సి ఉన్నా, ఇప్పుడు మాత్రం ఏకంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారనే టాక్ ఉంది.
ప్రధాన కారణం గ్రాఫిక్స్ వర్క్. భారీ స్థాయిలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కోసం ప్రత్యేకంగా టీమ్స్ పనిచేస్తున్నాయని సమాచారం. వశిష్ట, నిర్మాతలు సినిమా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని భావించి, ఎక్కువ సమయం తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఇక ఈ గ్యాప్ వల్ల అభిమానుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు క్వాలిటీ కోసం ఆలస్యం సరేనని చెబుతుంటే, మరికొందరు చిరు సినిమాలు వరుసగా వాయిదా పడటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.