
న్యూస్ డెస్క్: భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన దూకుడు వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మైదానంలో తన పోరాట పటిమకు విరాట్ కోహ్లీనే స్ఫూర్తి అని స్పష్టం చేశాడు.
సిరాజ్ చెప్పినట్టుగా, కోహ్లీ మైదానం బయట అందరితో స్నేహంగా ఉంటాడు. కానీ, ఆట మొదలైన తర్వాత ప్రత్యర్థిని పూర్తిగా శత్రువుగా చూసేవాడు. “అతని ఆ ఆగ్రహం, దూకుడు నన్ను కూడా ప్రభావితం చేసింది. నేను కూడా ఆ ఆలోచనతోనే బౌలింగ్ చేస్తాను. దూకుడు లేకపోతే నా బౌలింగ్ సరిగ్గా రాదు” అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
ఆర్‌సీబీ జట్టులో కోహ్లీతో కలిసి ఆడటం వల్ల వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని ఆయన తెలిపాడు. “ఫాస్ట్ బౌలర్లకు దూకుడు అవసరం. కానీ, బౌలర్ల కంటే కోహ్లీనే ఎక్కువగా అగ్రెసివ్‌గా ఉంటాడు” అని చెప్పాడు.
ప్రేక్షకుల మద్దతు ఎలా వినియోగించుకోవాలో కూడా కోహ్లీని చూసి నేర్చుకున్నానని సిరాజ్ చెప్పాడు. ఇంగ్లండ్ టూర్‌లో కీలక సమయంలో తాను ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపినట్లు ఉదాహరణగా వివరించాడు.
మొత్తానికి, విరాట్ కోహ్లీ ప్రభావం తన కెరీర్‌లో ఎంతో ఉందని, మైదానంలో తన దూకుడు వెనుక అతని పాత్రే ముఖ్యమని సిరాజ్ స్పష్టంగా చెప్పాడు.