న్యూస్ డెస్క్: అమెరికాలో విద్య, ఉద్యోగం, పర్యటనల కోసం వెళ్లే వారిని ప్రభావితం చేసేలా మరో కొత్త రుసుము ప్రవేశపెట్టింది అమెరికా ప్రభుత్వం. దీనిని ‘వీసా ఇంటిగ్రిటీ ఫీజు’గా పిలుస్తున్నారు.
ఇటీవల ఆమోదం పొందిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ చట్టంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల వీసా దరఖాస్తుదారులు అదనంగా 250 డాలర్లు (సుమారు రూ.21,435) చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కొత్త ఫీజు ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థులు, హెచ్-1బీ వీసాపై వెళ్లే ఉద్యోగార్థులు, పర్యాటకులపై ప్రభావం చూపనుంది. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ రుసుమును వసూలు చేయనుంది.
ఫీజు తిరిగి పొందాలంటే కఠిన నిబంధనలు ఉన్నాయి. ఐ-94 గడువు ముగియడానికి ఐదు రోజులు ముందు అమెరికా విడిచి వెళ్లితేనే రీఫండ్ లభిస్తుంది.
లేదా వీసా పొడిగింపు లేకుండా చట్టబద్ధంగా గ్రీన్ కార్డ్ పొందినవారికి మాత్రమే ఫీజు తిరిగి చెల్లించబడుతుంది. ఇది చాలా మందికి గందరగోళంగా మారే అవకాశం ఉంది.
భవిష్యత్‌లో ఐ-94, ఈఎస్‌టీఏ, ఈవీయూఎస్ ఫీజులూ పెరగబోతున్నాయని సమాచారం. శరణార్థులపై కూడా దీని ప్రభావం ఉంటుందని తెలిపారు.