
న్యూస్ డెస్క్: విదేశీ ప్రయాణాలపై ఆసక్తి ఉన్న భారతీయులకు అమెరికా నుంచి ఊహించని షాక్ తగిలింది. అమెరికా ప్రభుత్వం కొత్తగా ‘వీసా ఇంటిగ్రిటీ ఫీజు’గా రూ. 21,400 (250 డాలర్లు) అదనంగా వసూలు చేయనున్నది.
ఈ ఫీజు టూరిస్ట్, విద్యార్థి, ఉద్యోగ వీసాలపై వర్తించనుంది. బీ1, బీ2, ఎఫ్, ఎం, హెచ్1బీ, జే వీసాలపై ఇది అమలులోకి రానుంది. అయితే డిప్లొమాటిక్ వీసాలపై మినహాయింపు ఉంటుంది. బీ2 టూరిస్ట్ వీసా మొత్తం ఖర్చు ఇప్పుడు రూ. 35 వేలు దాటేలా మారింది.
ఈ ఫీజుతో పాటు కొన్ని సందర్భాల్లో అదనంగా సర్‌ఛార్జీ కూడా చెల్లించాలి. ఇక 2026 నుంచి ఈ పెంపు అధికారికంగా అమలులోకి రానుంది. ఇది విద్యార్థులు, ఉద్యోగార్థులు, పర్యాటకులకు ప్రభావం చూపనుంది.
అయితే, కొన్ని నిబంధనల ప్రకారం ఈ ఇంటిగ్రిటీ ఫీజును తిరిగి పొందే అవకాశం కూడా ఉంది. వీసా నిబంధనలు పాటించిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. ఐ-94 గడువు ముగిసే ముందు అమెరికా విడిచివేసినవారు తిరిగి తీసుకోవచ్చు.
ఈ నిర్ణయం భారత్ సహా అనేక దేశాల వీసా దారులపై ప్రభావం చూపనుంది. ప్రయాణ సన్నాహాలు చేస్తున్న వారు ఈ మార్పులపై అప్రమత్తంగా ఉండాలి.