
న్యూస్ డెస్క్: అమెరికా ప్రభుత్వం విధించిన అధిక టారిఫ్‌లు భారత ఎగుమతి రంగానికి గట్టి దెబ్బ కొట్టాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 2025లో భారత్ నుంచి అమెరికాకు జరిగిన ఎగుమతులు ఏకంగా 17.9 శాతం పడిపోయాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 11.7 శాతం తక్కువ. టారిఫ్‌ల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ అధిక టారిఫ్‌లు ఎగుమతిదారులపై భారీ భారంగా మారాయి. ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో పాటు, లాజిస్టిక్ ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. దీనితో అనేక భారత ఎగుమతిదారులు తమ సరుకులను అమెరికా మార్కెట్‌లో పోటీ ధరలతో అందించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎగుమతులు పడిపోతున్నప్పటికీ, భారత్ అమెరికా నుంచి దిగుమతులు మాత్రం పెరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్ దిగుమతులు $398 కోట్ల డాలర్లకు చేరాయి. ఇది గత ఏడాది కంటే 11.78 శాతం పెరుగుదల. దీంతో భారత్–అమెరికా వాణిజ్య సమతుల్యంలో అసమానతలు మరింత పెరిగాయి.
వాణిజ్య సమాఖ్యలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, “అమెరికాతో వాణిజ్య చర్చలను మళ్లీ ప్రారంభించి, టారిఫ్‌ల సడలింపుకు కృషి చేయాలి” అని విజ్ఞప్తి చేశాయి. సరైన దౌత్య చర్యలు తీసుకోకపోతే, రాబోయే నెలల్లో ఎగుమతి రంగం మరింత కష్టాల్లో పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆగస్టు 27 నుంచి అమెరికా ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే అనేక వస్తువులపై 50 శాతం వరకు టారిఫ్‌లు పెంచింది. ఈ నిర్ణయం ప్రధానంగా యంత్ర పరికరాలు, టెక్స్‌టైల్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపింది. అమెరికా వాణిజ్య శాఖకు పలు మార్లు అభ్యర్థనలు చేసినా, వారు తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు చేయడం లేదు.
