
న్యూస్ డెస్క్: దేశంలో జరుగుతున్న సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. “సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చాయి, మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం” అంటూ మోసగాళ్లు బెదిరించడంతో, ఒక 73 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా కోటి రూపాయలు సమర్పించిన ఘటనపై కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. దేశంలో సుప్రీంకోర్టుపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఫణంగా పెట్టలేమని ధర్మాసనం పేర్కొంది.
ఈ కేసును తామే స్వయంగా విచారణకు తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం, ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, అరెస్టుల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
“డిజిటల్, సైబర్ మోసాల్లో ఇది పరాకాష్ట” అని పేర్కొన్న సుప్రీంకోర్టు, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా సదరు వృద్ధురాలికి నకిలీ పత్రాలు చూపించడం వెనుక ఏం జరిగిందన్న విషయంపై కోర్టు సీరియస్ అయింది.
సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని, ఏది నిజమో, ఏది మోసమో గుర్తించే పరిస్థితి కూడా కరువవుతోందని ఈ ఘటన నిరూపించింది. తాజాగా వెలుగు చూసిన ఈ కేసు దేశంలోని సార్వోన్నత న్యాయస్థానాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది.
పంజాబ్‌కు చెందిన వృద్ధురాలు ఈ మోసమేనని గుర్తించి సుప్రీంకోర్టుకు లేఖ రాయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ సందర్భంగా పంజాబ్ వృద్ధురాలి కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని కూడా కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.
