
న్యూస్ డెస్క్: అమెరికా ఉద్యోగ మార్కెట్ క్రమంగా చల్లబడుతోంది. ఈ దెబ్బ అందరికంటే ఎక్కువగా యువ ఉద్యోగులపైనే పడుతోంది. వేతనాల వృద్ధి మందగించడం, కొత్త అవకాశాలు తగ్గిపోవడంతో వారి కెరీర్ ఆరంభంలోనే సవాళ్లు ఎదురవుతున్నాయి.
జేపీ మోర్గాన్ చేజ్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ వాస్తవాన్ని ధృవీకరిస్తున్నాయి. 25 నుంచి 29 ఏళ్ల వయస్సు గల ఉద్యోగుల వార్షిక వేతన వృద్ధి సెప్టెంబర్ నాటికి కేవలం 5.2 శాతానికి పడిపోయింది.
కరోనా తర్వాత ప్రతిభావంతుల కోసం కంపెనీలు భారీ జీతాలు ఆఫర్ చేశాయి. కానీ ఇప్పుడు ఆర్థిక అనిశ్చితి కారణంగా నియామకాలు తగ్గాయి. దీంతో, అధిక జీతాల కోసం ఉద్యోగాలు మారే అవకాశాలు యువతకు గణనీయంగా తగ్గిపోయాయి.
దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కూడా పెను ప్రభావం చూపుతోంది. కస్టమర్ సర్వీస్, డేటా ఎంట్రీ వంటి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో ఆటోమేషన్ పెరగడం వల్ల, కొత్త గ్రాడ్యుయేట్లకు అవకాశాలు లేకుండా పోతున్నాయి.
“కెరీర్ అభివృద్ధికి తొలి మెట్టుగా ఉండే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల తలుపులను మందగించిన నియామకాలు, ఆటోమేషన్ మూసివేస్తున్నాయి” అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రభావం కేవలం జీతాలకే పరిమితం కాలేదు. కెరీర్ నెమ్మదించడం, ఆదాయం తగ్గడం వల్ల ఇల్లు కొనుగోలు చేయడం, కుటుంబాన్ని ప్రారంభించడం వంటి కీలక జీవన లక్ష్యాలను యువత వాయిదా వేసుకోవాల్సి వస్తోంది.
