
న్యూస్ డెస్క్: గుజరాత్‌లోని కేవడియాలో జరిగిన ఐక్యతా దివస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు నివాళులర్పించిన ఆయన, దేశ ఐక్యత, భద్రతా అంశాలపై గట్టి సందేశం ఇచ్చారు. 550 సంస్థానాలను ఏకం చేసిన పటేల్ దార్శనికతను కొనియాడుతూ, ఆయన మార్గంలోనే తమ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు.
దేశ ఐక్యతకు సవాల్ విసురుతున్న నక్సలిజం, విభజన వాద శక్తులపై మోదీ తీవ్రంగా స్పందించారు. వాటిని సమూలంగా నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశ భద్రత విషయంలో ఎప్పటికీ రాజీ పడబోమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ విధానాలను మోదీ విమర్శించారు. పటేల్ కలను కాంగ్రెస్ విస్మరించడం వల్లే కశ్మీర్‌లో సమస్యలు పెరిగాయని, నాటి ప్రభుత్వాలు పాక్ ఉగ్రవాదానికి తలవంచాయని ఆరోపించారు.
“కానీ, ఇప్పుడు భారత్ మారింది” అని నొక్కి చెప్పిన ప్రధాని, “ఆపరేషన్ సిందూర్ ద్వారా మన సైన్యం శత్రువులకు భారత బలం ఏమిటో చూపించింది” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికగా నిలిచాయి.
దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న అక్రమ వలసదారులపై కూడా మోదీ దృష్టి సారించారు. చొరబాటుదారులను తరిమికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ, సర్దార్ పటేల్ స్మారక నాణెం, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. సైనిక పరేడ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
