
న్యూస్ డెస్క్: అమెరికాలో గ్రీన్ కార్డ్ సాధించి, శాశ్వతంగా స్థిరపడాలనుకునే లక్షలాది మంది భారతీయులకు నిరాశే ఎదురైంది. అగ్రరాజ్యం మరోసారి షాకిచ్చింది. సులభంగా పర్మనెంట్ రెసిడెన్సీని అందించే డైవర్సిటీ వీసా (DV) లాటరీ కార్యక్రమం నుంచి భారత్‌ను మళ్లీ తప్పించింది.
ఈ నిర్ణయం మరో మూడేళ్లపాటు కొనసాగనుంది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ నిబంధనల ప్రకారం, 2027 వరకు జరిగే డైవర్సిటీ వీసా లాటరీకి భారతీయులు అనర్హులు. దీంతో, లాటరీ ద్వారా అయినా అమెరికన్ కల నెరవేర్చుకుందామనుకున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ఈ డైవర్సిటీ ప్రోగ్రాం ఉద్దేశ్యమే అమెరికాకు తక్కువ వలసలు వచ్చే దేశాలకు అవకాశం ఇవ్వడం. కానీ, గత ఐదేళ్లలో విద్య, ఉద్యోగ వీసాలపై అమెరికా వెళ్లిన భారతీయుల సంఖ్య 50,000 మార్కును దాటింది. దీంతో భారత్ “హై మైగ్రేషన్ కంట్రీ” జాబితాలోకి వెళ్లింది.
అమెరికా జనాభాలో వైవిధ్యాన్ని పెంచేందుకు 1990లో ఈ లాటరీ వ్యవస్థను ప్రారంభించారు. దీని ద్వారా ఏటా 55,000 గ్రీన్ కార్డులను జారీ చేస్తారు. ప్రస్తుతం భారత్, చైనా, మెక్సికో, కెనడా వంటి అధిక వలస దేశాలు ఈ జాబితాలో లేవు.
భారత్‌కు అవకాశం లేనప్పటికీ, పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, భూటాన్ పౌరులకు ఈ లాటరీలో పాల్గొనే అర్హత ఉంది. ఆఫ్రికా, యూరప్, దక్షిణ అమెరికాలోని తక్కువ వలసలున్న దేశాలకు ఈ 55,000 వీసాలను కేటాయిస్తారు.
ఇప్పటికే H-1B వీసాలపై కఠిన నిబంధనలు, గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల నిరీక్షణతో సతమతమవుతున్న భారతీయులకు, ఈ లాటరీ మార్గం కూడా మూసుకుపోవడం పెద్ద దెబ్బ. దీంతో చాలా మంది యువత కెనడా, ఆస్ట్రేలియా వైపు చూస్తున్నారు.
