Friday, November 14, 2025
HomeSportsవన్డే చరిత్రలో వింత రికార్డు.. 50 ఓవర్లూ స్పిన్నర్లతోనే బౌలింగ్!

వన్డే చరిత్రలో వింత రికార్డు.. 50 ఓవర్లూ స్పిన్నర్లతోనే బౌలింగ్!

west-indies-spinners-bowl-all-50-overs-odi-record-bangladesh

న్యూస్ డెస్క్: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఇదివరకు ఎన్నడూ చూడని అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. వెస్టిండీస్ జట్టు ఏకంగా 50 ఓవర్ల పాటు కేవలం స్పిన్నర్లతోనే బౌలింగ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో, ఓ పూర్తిస్థాయి సభ్యదేశం ఇలా చేయడం చరిత్రలో ఇదే తొలిసారి.

ఈ మ్యాచ్‌కు ఉపయోగించిన షేర్ బంగ్లా స్టేడియం పిచ్, స్పిన్నర్లకు స్వర్గధామంగా మారింది. పూర్తిగా పొడిబారి, పగుళ్లతో దర్శనమిచ్చిన పిచ్‌ను చూసిన విండీస్ కెప్టెన్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. జట్టులోని ఐదుగురు స్పిన్నర్లు అకీల్ హోసేన్, రోస్టన్ ఛేజ్, ఖారీ పియర్, గుడకేశ్ మోటీ, అలిక్ అథనేజ్ తమ 10 ఓవర్ల కోటాను పూర్తి చేశారు.

ఈ స్పిన్ ఉచ్చులో బంగ్లాదేశ్ బ్యాటర్లు విలవిల్లాడారు. పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. 46 ఓవర్ల ముగిసేసరికి 163 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సౌమ్య సర్కార్ 89 బంతుల్లో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

అయితే, చివర్లో క్రీజులోకి వచ్చిన స్పిన్ ఆల్‌రౌండర్ రిషద్ హొస్సేన్ అనూహ్యంగా ఎదురుదాడికి దిగాడు. కేవలం 14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు బాది ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు.

అతని విధ్వంసం కారణంగా, చివరి నాలుగు ఓవర్లలో బంగ్లాదేశ్ ఏకంగా 50 పరుగులు పిండుకుంది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ మూడు వికెట్లతో సత్తా చాటగా, అథానాజే, హోసేన్ చెరో రెండు వికెట్లు పంచుకున్నారు. పూర్తిగా స్పిన్‌కు అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఇప్పుడు వెస్టిండీస్‌కు కత్తి మీద సాములా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular