
న్యూస్ డెస్క్: కేవలం తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కాలనే ఉద్దేశంతో ఆ దేశానికి వెళ్లి డెలివరీలు చేయించుకునే విధానానికి ట్రంప్ సర్కార్ చెక్ పెట్టింది. అమెరికన్ వలస విధానాన్ని కఠినతరం చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అమెరికాలో పుట్టిన వారికి ఆటోమేటిక్ గా పౌరసత్వం లభిస్తుందనే వెసులుబాటును సంపన్నులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన ట్రంప్ ప్రభుత్వం, వీసా జారీ విషయంలో టూరిస్ట్ ఉద్దేశం ఏమై ఉంటుందన్న దానిపై ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది.
ఒకవేళ పుట్టబోయే బిడ్డకు పౌరసత్వం కోసమే తల్లిదండ్రులు అమెరికా వస్తున్నారని గుర్తిస్తే, అలాంటి వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తామని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం తాజాగా స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి వాటిని అనుమతించేది లేదని సోషల్ మీడియాలో కూడా హెచ్చరికలు జారీ చేసింది.
బిడ్డ డెలివరీ కోసం అమెరికా పర్యటనను ప్రధాన ఉద్దేశంగా భావిస్తే, వారి వీసాలు రిజెక్ట్ అవుతాయి. మొత్తం మీద తమ దేశంలోకి అడుగు పెట్టే ప్రతి ఒక్కరినీ సంపూర్ణంగా స్కాన్ చేసిన తర్వాతే అనుమతించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది.
