
ప్రపంచ ప్రఖ్యాత టెస్లా సంస్థ ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో తొలి టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభమైంది. కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ లక్ష్యంగా పెట్టుకున్న తొలి ఈవీ మోడల్ వై కారును కూడా విడుదల చేశారు.
ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, పోటీ వాతావరణం ఆవిష్కరణకు దారి తీస్తుందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ కూడా టెస్లాకు పూర్తి మద్దతు ప్రకటించారు.
ప్రస్తుతం మోడల్ వై కారు షాంఘై నుంచి దిగుమతి అవుతుండగా, ధర రూ.61 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీనితోపాటు టెస్లా త్వరలోనే దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
నెక్స్ట్-జెన్ వీ4 సూపర్‌చార్జర్లు కూడా దేశంలో ప్రవేశించనున్నాయి. కేవలం 15 నిమిషాల్లో 267 కిలోమీటర్ల వరకు ఛార్జ్ చేసే సామర్థ్యం వీటికి ఉండటం విశేషం.
దేశీయంగా టాటా, ఎంజి మోటార్ వంటి బ్రాండ్లతో పాటు టెస్లా ప్రవేశం ఈవీ విభాగాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లనుంది.