
న్యూస్ డెస్క్: జూన్ 26 నుంచి పాకిస్థాన్ అంతటా కురుస్తున్న కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తుల కారణంగా ఇప్పటివరకు 116 మంది మృతిచెందగా, 253 మంది వరకు గాయపడ్డారని పాకిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) వెల్లడించింది.
గత 24 గంటల్లోనే మరో ఐదుగురు చనిపోయినట్టు, 41 మంది గాయపడ్డారని ఎన్‌డీఎంఏ తాజా నివేదిక తెలిపింది. వర్ష సంబంధిత ప్రమాదాల్లో తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లో అత్యధికంగా 44 మంది మృతిచెందారు.
వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వాలో 37 మంది, దక్షిణ సింధ్‌లో 18 మంది, బలూచిస్థాన్‌లో 16 మంది మరణించినట్లు సమాచారం. రాజధాని ఇస్లామాబాద్ ప్రాంతంలో అయితే ప్రాణనష్టం జరగలేదు.
రేపటి వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపింది.
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలం ఉండే పాకిస్థాన్‌లో ప్రతి ఏడాది ఇటువంటి విపత్తులు ప్రాణనష్టానికి దారి తీస్తున్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండమని కోరుతున్నారు.
