
జమ్మూకాశ్మీర్: ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. ఈ ఘర్షణల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందడం తెలుగు ప్రజలను విషాదంలో ముంచింది.
మురళీ నాయక్ ఏపీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినవాడు. గురువారం రాత్రి సరిహద్దు వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో భారత సైన్యం ధీరంగా ప్రతీకారం తీసుకున్నా, ఈ ఎదురుకాల్పుల్లో మురళీ ప్రాణాలు కోల్పోయాడు.
శనివారం ఆయన పార్థివ దేహం స్వగ్రామానికి రానుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మురళీ చిన్నతనం నాగినాయని చెరువుతండాలో గడిచింది.
సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్ నుంచి చదువుకున్న మురళీ దేశసేవలో తన ప్రాణాలను అర్పించాడు. కుటుంబ సభ్యులు కన్నీటి మడుగులో మునిగిపోయారు. గ్రామమంతా విషాదఛాయలు అలముకున్నాయి.
వీర జవాన్ త్యాగానికి రాష్ట్రం తలవంచి గౌరవం చెల్లిస్తోంది. ప్రభుత్వ ప్రతినిధులు, స్థానిక ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని సైనిక వర్గాలు పేర్కొన్నాయి.