
న్యూస్ డెస్క్: తెలంగాణలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఎస్సీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మధ్య నెలకొన్న వివాదం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయం కావడంతో ఈ ఘర్షణ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసింది.
అయితే పార్టీ అధిష్టానం మధ్యవర్తిత్వంతో ఇరువురినీ సమన్వయం చేసి తాత్కాలికంగా పరిస్థితిని చక్కదిద్దగలిగింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బలమైన ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్న కాంగ్రెస్‌కు ఈ అంతర్గత వివాదం పెద్ద మైనస్‌గా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బీసీ ఎస్సీ వర్గాల మధ్య విభేదాలు బహిర్గతం కావడం పార్టీ సామాజిక సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇక బీఆర్‌ఎస్ ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. పొన్నం వ్యాఖ్యలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యం చేస్తూ కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.
కాంగ్రెస్ పెద్దలు చివరికి ఇరువురిని పిలిచి, చర్చించి, సారీ చెప్పించి తాత్కాలిక సమసిపరిచారు. కానీ ఈ వివాదం ఎన్నికల సమయంలో పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తుందో ఇంకా చూడాల్సి ఉంది. “చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు” ఈ నిర్ణయం ఆలస్యంగా వచ్చిందన్న విమర్శలు పార్టీ లోపల నుంచే వినిపిస్తున్నాయి.
