
న్యూస్ డెస్క్: తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామీణ రాజకీయాల్లోని విచిత్రమైన మలుపులు, భావోద్వేగాలను బయటపెట్టాయి. ఈ ఎన్నికల్లో చోటు చేసుకున్న కొన్ని ఆశ్చర్యకరమైన ఘటనలు ప్రజాస్వామ్యం ఎంత జీవంతో ఉందో, ఎంత దిగజారుతోందో చూపిస్తున్నాయి.
చర్చనీయాంశమైన చిత్రాలు:
- బాండ్ పేపర్ల హామీలు: కొందరు అభ్యర్థులు కేవలం మాటలతో సరిపెట్టకుండా, తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి హామీలను బాండ్ పేపర్లపై రాసి, ప్రజలకు ఇచ్చారు. ప్రజలు కూడా ఆ రాతలను నమ్మకంగా పట్టుకోవడం, ప్రజాస్వామ్యంలో మాటకు విలువ తగ్గిపోయి, రాతే నమ్మకంగా మారిందా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది.
- ఒకే ఓటు.. తారాస్థాయి భావోద్వేగాలు: అనేక గ్రామాల్లో ఒక్క ఓటుతో గెలుపు ఓటములు నిర్ణయం కావడం భావోద్వేగాలను పెంచింది. కొందరి అదృష్టం చిట్టీ చేతిలో తేలడంతో, ఓట్లు సమానంగా పడి లాటరీ ద్వారా సర్పంచ్‌లు ఎన్నికయ్యారు.
- స్వీపర్ సర్పంచ్‌గా గెలుపు: గ్రామంలో శుభ్రత పనులు చేసే వ్యక్తి ప్రజల నమ్మకాన్ని పొంది సర్పంచ్‌గా ఎన్నిక కావడం సామాజిక మార్పుకు, వ్యక్తిత్వం సేవ ముందుకు వచ్చాయనడానికి నిదర్శనం.
- నల్గొండలో వింత యాత్ర: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవానిలో ఓడిపోయిన బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థి కల్లూరి బాలరాజు చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో 450 ఓట్ల తేడాతో ఓడిపోయిన బాలరాజు, దేవుడి ఫోటో పట్టుకుని ఇంటింటికీ తిరిగారు. ‘మీరు నాకు ఓటు వేయకుంటే డబ్బులు తిరిగి ఇవ్వండి‘ అని ప్రజలను వేడుకున్నారు. కొందరు తిరిగి డబ్బులు ఇచ్చేశారట.
గ్రామ రాజకీయాల్లో దిగజారుడు:
ఈ ఘటనలు గ్రామ రాజకీయాల్లో ఓటు అనేది అభివృద్ధి నాయకత్వం అనే భావనకన్నా, పెట్టుబడి-లాభం అనే లావాదేవీలా మారిపోయిందనే ఆందోళనను పెంచుతున్నాయి. ఓటమి తర్వాత డబ్బులు తిరిగి అడిగే స్థాయికి రాజకీయం దిగజారడం, గెలిచిన ఓడిన వారి మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఏది ఏమైనా, ఎన్నికలు ముగిశాక గ్రామాలు కలిసి నడవాలని, గెలిచినవారు అందరినీ తమవారిగా చూసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
