
న్యూస్ డెస్క్: ముంబయిలో జరిగిన ఒక హిట్ అండ్ రన్ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సమాజానికి ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తున్నాయి. ‘ఇలాంటి అబ్బాయిలకు గుణపాఠం నేర్పించాల్సిందే‘ అంటూ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు నిబంధనలు ఉల్లంఘించే ధోరణిపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాయి.
అసలు కేసు ఏంటి?:
మద్యం మత్తులో కారును అతివేగంగా నడిపిన నిందితుడు మిహిర్ షా, బైక్‌పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే నిందితుడు ప్రమాదం జరిగిన వెంటనే ఆపకుండా పారిపోవడం ఈ కేసును మరింత తీవ్రతరం చేసింది.
ప్రమాదం అనేది అనుకోకుండా జరగవచ్చు కానీ, బాధ్యత తీసుకోకుండా పారిపోవడం స్పష్టమైన నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సామాజిక హోదా ఖరీదైన కారు చట్టం ముందు రక్షణ కవచం కాదని తేల్చి చెప్పింది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు:
రహదారులను ఆటస్థలాలుగా మార్చి, ప్రాణాలతో ఆటలాడే ధోరణిపై ఇది ఒక స్టాప్ సిగ్నల్ అని న్యాయస్థానం పేర్కొంది. నిందితుడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ, ‘కొద్ది రోజులు జైల్లో ఉండాలి’ అన్న వ్యాఖ్యతో తప్పు చేసినవారికి భయం బాధ్యత ఉండాలని సూచించింది.
చాలా సందర్భాల్లో హిట్ అండ్ రన్ నిందితులు ప్రభావవంతమైన కుటుంబాలకు చెందినవారై ఉండడం వల్ల, చట్టం తమను ఏమీ చేయదన్న ధీమాతో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ధీమాకు చెక్ పెట్టేందుకే సుప్రీంకోర్టు ఈసారి గట్టిగా మాట్లాడింది.
మద్యం తాగి వాహనం నడపడం, ప్రమాదం తర్వాత పారిపోవడం స్పష్టమైన నేర ఉద్దేశాన్ని చూపిస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది. బాధిత కుటుంబానికి న్యాయం అంటే కేవలం పరిహారం కాదు, నిందితుడికి శిక్ష పడడం సమాజానికి ఉదాహరణగా నిలవడం కూడా న్యాయంలో భాగమేనని పేర్కొంది. ఈ తీర్పు యువతకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది.
