
న్యూస్ డెస్క్: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మరోసారి యూదులే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగింది. బోండీ బీచ్‌లో “చానుకా బై ద సీ” ఉత్సవాన్ని జరుపుకుంటున్న వారిపై ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, సుమారు 40 మంది గాయపడ్డారు.
ఈ దాడికి పాల్పడిన తండ్రీకొడుకులను సాజిద్ అక్రం (50) నవీద్ అక్రం (24)గా గుర్తించారు. న్యూ సౌత్ వేల్స్ పోలీసు కమిషనర్ మాల్ లాన్యోన్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు ఇద్దరూ పాకిస్థాన్ నుంచి వచ్చినవారే. భద్రతాదళాలు జరిపిన ఎదురుదాడిలో సాజిద్ మృతి చెందగా, నవీద్ చికిత్స పొందుతున్నాడు.
దర్యాప్తులో వారికి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐ.ఎస్.ఐ.ఎస్.)తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు ఉపయోగించిన కారులో ఐసిస్ జెండాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, ఈ దాడిలో సాజిద్ అక్రంతో పోరాడి, తుపాకీ లాక్కొని, అనేక ప్రాణాలు కాపాడిన 43 ఏళ్ల అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తిని ‘ధైర్యవంతుడైన ముస్లిం’ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసించారు.
