
న్యూస్ డెస్క్: ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో పిల్లలు ఆన్‌లైన్‌లో కాలం గడపడంపై రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. బడుల్లో గ్రౌండ్‌లో బాల్యాన్ని అందంగా మలచుకోవాల్సిన చిన్నారులు నిత్యం ఆన్‌లైన్లో గడపడం దురదృష్టకరమని ఆమె సభావేదికగా తెలిపారు.
తలిదండ్రులు తమ పిల్లలు ఆన్‌లైన్‌లో కాలం గడపడాన్ని ప్రివిలేజ్‌గా భావిస్తున్నారని సుధామూర్తి అన్నారు. ఈ పోకడ దీర్ఘకాలంలో పిల్లల మానసిక రుగ్మతలకు దారితీస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఎంపీ సుధామూర్తి రాజ్యసభ జీరో అవర్‌లో ఈ విషయం లేవనెత్తారు. పిల్లలు సోషల్ మీడియా వాడకానికి సంబంధించి ప్రభుత్వం నియమనిబంధనల్ని రూపొందించి అమలు చేయాలని ఆమె కోరారు.
ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు పిల్లలు సోషల్ మీడియా ఆన్‌లైన్ వాడకంపై పలు నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఆమె సభ దృష్టికి తెచ్చారు. భారత దేశం కూడా ఈ విధానాన్ని అనుసరించాల్సిన సందర్భం వచ్చిందన్నారు.
పిల్లల వీడియోలు తలిదండ్రులకు ఆదాయ వనరులుగా మారిపోయాయని ఆమె వాపోయారు. దీనివల్ల పిల్లలు బాల్యంలో ఉండే సున్నితత్వాన్ని కోల్పోతున్నారని, సామాజిక నైపుణ్యాలు, ఆటలకు దూరంగా ఉండిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం సోషల్ మీడియాకు సంబంధించి కఠినమైన విధానాలు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలా చేయకుంటే భవిష్యత్తులో పిల్లల పరిస్థితి దారుణంగా మారుతుందని అన్నారు.
