
న్యూస్ డెస్క్: ఇండిగో విమాన సంస్థలో ఏర్పడిన నిర్వహణ లోపం కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో విమానాలు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోవడంతో, రైల్వే శాఖ మద్దతు తెలపడానికి ముందుకు వచ్చింది.
విమానాల రద్దు కారణంగా ఇతర మార్గాలను వెతుక్కుంటున్న ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని, భారతీయ రైల్వే వ్యవస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ అనేక ముఖ్యమైన మార్గాల్లో సామర్థ్యాన్ని పెంచడానికి నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా 37 ప్రీమియం రైళ్లకు 116 అదనపు కోచ్‌లను జోడించింది. దక్షిణ రైల్వే 18 ప్రధాన రైళ్లలో ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచింది.
అలాగే తూర్పు రైల్వే 3 కీలక రైళ్లలో అదనపు స్లీపర్ క్లాస్‌లను జోడించింది. ఉత్తర రైల్వే 8 రైళ్లలో థర్డ్ ఏసీ కోచ్‌లను అదనంగా జోడించింది.
రైల్వే సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు కాస్త ఉపశమనం లభించింది. ఈ మార్పులను ఈ నెల 10వ తేదీ వరకు 10 రద్దీ మార్గాల్లో అమలు చేయనున్నారు.
ఇదిలా ఉండగా, విమానాల రద్దు సంక్షోభం ఏకంగా సుప్రీంకోర్టును తాకింది. విమాన సర్వీసుల రద్దుపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ లోపంపై విచారణ కమిటీ వేస్తామని తెలిపారు.
