
ఏపీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తన సోదరుడు జగన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరు పర్యటన సందర్భంగా జరిగిన అప్రతిష్టకర ఘటనలపై స్పందించిన ఆమె, జగన్‌కు ప్రజల ప్రాణాలపై చింత లేదని విమర్శించారు.
బెట్టింగ్‌ల వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించకుండా, వారి విగ్రహాలు వేయడం ఏమిటని ప్రశ్నించారు.
జగన్ నిన్నటి పర్యటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని, వారిలో ఒకరు వృద్ధుడు కాగా మరొకరు వైసీపీ కార్యకర్త అంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాణహానికి నేరుగా జగన్ బాధ్యత వహించాలన్నారు. బల ప్రదర్శనలు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే హక్కు ఎవరికీ లేదన్నారు.
ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన షర్మిల, ప్రజా జీవితాలకు హాని కలిగించే కార్యక్రమాలకు కళ్లెం వేయాలని కోరారు. జగన్ ప్రజల కోసం పోరాడే దమ్ము కలిగించుకోవాలని సూచించారు.
ఇప్పటికైనా జగన్ బుద్ధి మారాలని, ప్రజా సమస్యలపై సమగ్ర పోరాటం చేయాలంటూ హితవు పలికారు. రాజకీయ శ్రేయస్సుకోసం ప్రాణాల్ని పణంగా పెట్టొద్దని అన్నారు.