Friday, April 17, 2026
HomeInternational'లేడీ జేమ్స్ బాండ్'కు అరుదైన గౌరవం.. గూఢచార మ్యూజియంకు చీఫ్‌!

‘లేడీ జేమ్స్ బాండ్’కు అరుదైన గౌరవం.. గూఢచార మ్యూజియంకు చీఫ్‌!

russian-spy-anna-chapman-appointed-chief-of-intelligence-museum

న్యూస్ డెస్క్: దాదాపు 15 ఏళ్ల క్రితం అమెరికాలో గూఢచారిగా పట్టుబడి, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రష్యన్ ‘లేడీ జేమ్స్ బాండ్’ అన్నా చాప్‌మాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. గూఢచర్య ఆరోపణలపై అమెరికా నుండి బహిష్కరణకు గురైన ఆమెకు, ఇప్పుడు రష్యా ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కట్టబెట్టింది. రష్యన్ గూఢచార చరిత్ర, వారి విజయాలను ప్రదర్శించేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన “మ్యూజియం ఆఫ్ రష్యన్ ఇంటెలిజెన్స్”కు అన్నా చాప్‌మాన్‌ను చీఫ్‌గా నియమిస్తూ పుతిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

2009లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ముసుగులో అన్నా చాప్‌మాన్ అమెరికాలో అడుగుపెట్టారు. ఆమె అసలు లక్ష్యం రష్యన్ “స్లీపర్ సెల్”లో భాగంగా పనిచేయడం. అయితే, “ఆపరేషన్ ఘోస్ట్ స్టోరీస్” పేరుతో నిఘా పెట్టిన ఎఫ్‌బీఐ, 2010లో ఆమెతో పాటు మరో 9 మంది రష్యన్ గూఢచారులను అరెస్టు చేసింది. అప్పట్లో ఈ ఘటన అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా మధ్య తీవ్ర దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది.

అయితే, ఈ అరెస్టుల డ్రామా ఎక్కువ కాలం సాగలేదు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే, అమెరికా-రష్యా మధ్య ఉన్నత స్థాయిలో “గూఢచారుల మార్పిడి” ఒప్పందం కుదిరింది. అమెరికాలో పట్టుబడిన 10 మంది రష్యన్ స్పైలను, రష్యాలో ఖైదీలుగా ఉన్న నలుగురు అమెరికన్ ఏజెంట్లతో మార్చుకున్నారు. దీంతో అన్నా చాప్‌మాన్ తిరిగి స్వదేశానికి చేరుకున్నారు.

అన్నా చాప్‌మాన్ నేపథ్యం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఆమె తండ్రి సోవియట్ హయాంలో ఉన్నత దౌత్యవేత్త. మాస్కోలో ఎకనామిక్స్ చదివిన ఆమె, ఓ బ్రిటిష్ విద్యార్థిని పెళ్లాడి లండన్‌లో స్థిరపడ్డారు. అక్కడే ఆమె ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, నెట్‌వర్కింగ్ నైపుణ్యాలు రష్యన్ ఇంటెలిజెన్స్ అధికారులను ఆకర్షించాయి. కఠిన శిక్షణ తర్వాత ఆమె “రష్యన్ బ్లాక్ విడో”గా మారి, ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి సమాచారం సేకరించే ఆపరేటివ్‌గా మారారు.

అమెరికా నుంచి బహిష్కరణకు గురైనా, రష్యాలో అన్నా చాప్‌మాన్‌కు జాతీయ హీరోగా బ్రహ్మరథం పట్టారు. ఆమె ఓ సెలబ్రిటీగా మారిపోయారు. టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు, పబ్లిక్ స్పీకర్‌గా మారారు. ఆ తర్వాత అధ్యక్షుడు పుతిన్ పార్టీలో చేరి రాజకీయ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు.

ఇప్పుడు, 15 ఏళ్ల తర్వాత, ఒకప్పటి “శత్రు దేశం”లో గూఢచారిగా పనిచేసిన వ్యక్తినే.. తమ గూఢచార చరిత్రను, విజయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసే మ్యూజియంకు అధిపతిగా నియమించడం ఆసక్తికరం. ప్రస్తుతం ఒక కుమారుడికి తల్లిగా రష్యాలో నివసిస్తున్న అన్నా చాప్‌మాన్, ఆ దేశంలో “దేశభక్తికి ప్రతీక”గా నిలుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular