
న్యూస్ డెస్క్: వచ్చే ఏడాది భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌కు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను టోర్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. హిట్ మ్యాన్ ఘనమైన కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ హోదా దక్కింది.
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ 10వ టీ20 ప్రపంచ కప్‌లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టనుంది. 2016 తర్వాత పొట్టి ఫార్మాట్ విశ్వసమరానికి మన దేశం వేదిక కావడం ఇదే మొదటిసారి.
2007 నుంచి జరిగిన 9 టీ20 ప్రపంచ కప్‌లలోనూ ఆడిన ఏకైక ఆటగాడు రోహితే కావడం గమనార్హం. 2007 విజేత జట్టులో ఉండి, 2024లో కెప్టెన్‌గా కప్ గెలిచి ఈ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు.
షెడ్యూల్ విడుదల సందర్భంగా మాట్లాడిన రోహిత్.. ఈ అంబాసిడర్ హోదా తనకు దక్కడం గొప్ప గౌరవం అన్నారు. తాను ఆడుతున్నప్పుడు ఈ అవకాశం రాలేదని చమత్కరించారు.
ప్రస్తుతం ఉన్న టీమ్ ఇండియా కూర్పుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కుర్రాళ్లు బాగా ఆడుతున్నారని, ప్రపంచ కప్ జట్టులో పెద్దగా మార్పులు అవసరం లేదనే అభిప్రాయం వెలిబుచ్చారు.
ప్రపంచ విజేత ట్యాగ్ కోసం తామెంత తపించామో వివరించిన రోహిత్.. కప్ కొట్టలేకపోయిన సమయంలో నిరాశకు గురైనట్లు తెలిపారు. ఈసారి యువ జట్టు మళ్లీ దేశానికి విజయాన్ని తెస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
