
న్యూస్ డెస్క్: ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో ఎందరో నేతలను గెలిపించిన ప్రశాంత్ కిషోర్ (PK), తన సొంత పరీక్షలో మాత్రం ఫెయిల్ అయ్యారు. బీహార్ ఎన్నికల ఫలితాలు ఆయనకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. ఫలితాలు వచ్చిన రోజు నుంచి తనకు కంటిమీద కునుకు కూడా లేదని ఆయన స్వయంగా అంగీకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘జన్ సూరజ్’ పేరుతో కొత్త పార్టీ పెట్టి బరిలోకి దిగితే, జనం ఇంత ఘోరంగా తిరస్కరిస్తారని ఆయన అస్సలు ఊహించలేదట.
సర్వేల మాస్టర్‌గా పేరున్న పీకే, తన పార్టీ విషయంలో మాత్రం ఎలాంటి సర్వేలు లేకుండా ‘బ్లైండ్ గేమ్’ ఆడేశానని ఒప్పుకున్నారు. కనీసం 12 నుంచి 15 శాతం ఓట్లు వస్తాయని లెక్కలేసుకుంటే, వచ్చింది మాత్రం కేవలం 3.5 శాతమే. బీహార్ జనం ఇంకా కులం, మతం, లేదా లాలూ-బీజేపీ భయంతోనే ఓట్లు వేస్తున్నారని, తాను కేవలం ఉద్యోగాల గురించి మాట్లాడటం వల్లే ఓటర్లను ఆకట్టుకోలేకపోయానని ఆయన విశ్లేషించుకున్నారు.
ఇక నితీష్ కుమార్ పార్టీ (JDU)కి 25 సీట్లు కూడా రావని ఎన్నికలకు ముందు పీకే పెద్ద సవాల్ విసిరారు. కానీ సీన్ రివర్స్ అయ్యి జేడీయూ 85 సీట్లతో సత్తా చాటింది. దీనిపై పీకే స్పందిస్తూ.. ప్రభుత్వం చివరి నిమిషంలో ఆడిన ‘డబ్బు’ మాయాజాలమే తన అంచనాను తలకిందులు చేసిందన్నారు. దాదాపు కోటిన్నర మంది మహిళలకు డబ్బులు పంపిణీ చేయడం, నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం వల్లే ఫలితాలు ఇలా వచ్చాయని కవర్ చేసుకున్నారు.
ఇంతటి ఘోర పరాభవం ఎదురైనా పీకేలో కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గలేదు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ గతాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న బీజేపీకి కూడా ఒకప్పుడు పార్లమెంట్‌లో రెండే రెండు సీట్లు ఉండేవని, కొత్త పార్టీలకు ఇలాంటి ఫలితాలు సహజమేనని చెప్పుకొచ్చారు. తాము కులమతాల విషం చిమ్మకుండా, మంచి చేయాలనే వచ్చాం కాబట్టి, ఫలితాలు రావడానికి టైమ్ పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
“నేను బీహార్ మార్పు కోసం 10 ఏళ్లు కేటాయిస్తానని ముందే చెప్పా. ఇప్పటికి మూడున్నరేళ్లు అయ్యింది. మూడేళ్లలోనే గెలుస్తానన్న అతి నమ్మకంతో వెళ్లాను, అది జరగలేదు. అంతమాత్రాన నేను పారిపోను” అంటూ పీకే ఎమోషనల్ అయ్యారు. ఓటమి భయంతో వెనక్కి తగ్గేది లేదని, రాబోయే ఐదేళ్లు కూడా ప్రజల మధ్యే ఉంటానని స్పష్టం చేశారు.
