
ఢిల్లీ: ఎర్రకోట బాంబు పేలుడు కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. తీగ లాగితే డొంక కదలడం కాదు, ఏకంగా ఒక ఉగ్రవాద ఫ్యాక్టరీనే బయటపడుతోంది. రీసెంట్ గా పాకిస్థాన్‌కు చెందిన జైష్ ఎ మొహమ్మద్ (JeM) ఉగ్రసంస్థ కొత్త ప్లాన్ బయటపడింది. మరోసారి ఆత్మాహుతి దాడులు చేయడానికి వాళ్లు బహిరంగంగానే విరాళాలు అడుగుతున్నారని తెలుస్తోంది. ఒక్కొక్కరు 20 వేల పాకిస్థాన్ రూపాయలు ఇవ్వాలంటూ ‘సదాపే’ (SadaPay) లాంటి యాప్స్ ద్వారా డిజిటల్ వసూళ్లకు పాల్పడుతున్నారట.
అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే.. జైష్ ఇప్పుడు మహిళా విభాగాన్ని రంగంలోకి దింపింది. మసూద్ అజార్ సోదరి సాదియా దీనికి లీడర్ కాగా, ఎర్రకోట కేసులో కీలక నిందితురాలైన ‘మేడమ్ సర్జన్’ (డాక్టర్ షాహీనా) కూడా ఈ వింగ్ మెంబరేనట. ఇదిలా ఉంటే, భారత నిఘా వర్గాలకు మరో కొత్త తలనొప్పి మొదలైంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న ‘అల్ ఫలాహ్’ యూనివర్సిటీ నుంచి కనీసం 10 మంది అదృశ్యమయ్యారు.
వీరిలో ముగ్గురు కాశ్మీరీలు కూడా ఉన్నారు. వీరందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం ఇప్పుడు కలవరపెడుతోంది. వీరంతా ఎర్రకోట బ్లాస్ట్‌కు ప్లాన్ చేసిన “టెర్రర్ డాక్టర్” మాడ్యూల్‌లో భాగమేనని, వీరిని స్లీపర్ సెల్స్‌గా వాడుకునే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. అసలు ఈ అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఇప్పుడు ఉగ్రవాదానికి ‘గ్రౌండ్ జీరో’గా మారిపోయింది. 15 మంది ప్రాణాలు తీసిన ఎర్రకోట కారు బాంబు ప్లాన్ ఇక్కడే రూపుదిద్దుకుంది.
ఇప్పుడు అదృశ్యమైన ఈ 10 మంది విద్యార్థులా? లేక ఉద్యోగులా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో వీరి అదృశ్యం బయటపడింది. వీళ్లు ఎక్కడ నక్కి ఉన్నారు? నెక్స్ట్ టార్గెట్ ఏంటి? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. కేవలం విద్యార్థులు, డాక్టర్లే కాదు.. ఏకంగా ఈ విద్యాసంస్థల అధినేతే కటకటాల పాలయ్యాడు.
టెర్రర్ ఫండింగ్, మనీ లాండరింగ్ కేసులో యూనివర్సిటీ ఫౌండర్ జావేద్ అహ్మద్ సిద్దిఖీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది. అంటే, చదువు చెప్పాల్సిన సరస్వతీ ఆలయం, పక్కా ప్లాన్‌తో నడిచే ఉగ్రవాద కేంద్రంగా ఎలా మారిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ కేసులో ఆత్మాహుతి దాడి చేసిన డాక్టర్ ఉమర్ మహమ్మద్ చనిపోగా, మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ, ఇప్పుడు ఈ 10 మంది ‘మిస్సింగ్’ మిస్టరీ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
